9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ..(police constable recruitment for 9281 posts)


భారీ సంఖ్యలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. పోలీస్ నియామకాలు భారీ స్థాయిలో చేపడ్తామని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త సంవత్సర కానుకగా 9281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్‌శాఖ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు, టీఎస్‌ఎస్‌పీలో 4065 పోస్టులు కూడా ఉన్నాయి. సివిల్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మూస నియామక పద్ధతులకు స్వస్తి చెప్తూ ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత సాధారణ దేహదారుఢ్య పరీక్ష, అనంతరం మెయిన్స్ నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 
 -నోటిఫికేషన్ విడుదల చేసిన పోలీస్‌శాఖ
-సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు
-ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు
-ఎస్‌ఏఆర్సీపీఎల్‌లో 56, టీఎస్‌ఎస్పీలో 4065
-ఎస్పీఎఫ్‌లో 174, ఫైర్‌లో 416 పోస్టుల భర్తీ
-ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
-ఏప్రిల్ 3న ప్రిలిమినరీ పరీక్ష

ఆన్‌లోన్ దరఖాస్తులు.. 


జనవరి 11నుంచి ఫిబ్రవరి 4 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని, WWW.TSLPRB.IN వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలను చూడవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం WWW.TSLPRB.IN వెబ్‌సైట్ సందర్శించాలని కోరారు. ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుందని, మీ సేవ, ఈసేవ, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్, పేమెంట్ గేట్‌వేద్వారా ఫీజు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 3న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు

పూర్తిగా మారిన నియామక పద్ధతులు 


మూడేండ్ల వయో పరిమితి పెంచడంతోపాటు నియామక పద్ధతులను పూర్తి స్థాయిలో మార్చినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. ఐదు కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ల పరుగు పందెం రద్దు చేశామని వెల్లడించారు. 

-ముందుగా ప్రిలిమినరీ రాతపరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30% మార్కులు సాధిస్తే సాధారణ అర్హత పొందుతారు. 
-ఈ నియామకాల్లో సివిల్ విభాగంలో 33%, ఏఆర్, ఎఫ్‌పీబీ, కమ్యూనికేషన్ విభాగంలో 10% మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది.
-పురుషుల విభాగంలో నిర్వహించే ఐదు దేహదారుఢ్య పరీక్షల్లో మూడింటిలో ఉత్తర్ణీత సాధించాలని సూచించారు. మహిళలు మూడింటికిగాను రెండింటిలో ఉత్తర్ణీత సాధించాల్సి ఉంటుంది.

-పురుషుల విభాగంలో 800 మీటర్ల పరుగు పందెం, మహిళలకు 100 మీటర్ల పరుగుపందెం తప్పనిసరి.
-మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గిరిజన అభ్యర్థులకు ఛాతి, ఎత్తు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. 
-జనరల్ విభాగంలో పోటీపడే పురుష అభ్యర్థుల ఎత్తు 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతి 86.3 సెంటీమీటర్ల నుంచి ఊపిరి పీల్చినప్పుడు ఐదు సెంటిమీటర్లు పెరిగేలా ఉండాలి. మహిళ అభ్యర్థులకు ఎత్తు 152.5 ఉండాలి.
-ఎస్టీ పురుష అభ్యర్థులకు ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతి 80సెంటీమీటర్లు, ఊపిరి పీల్చితే 3 సెంటిమీటర్లు పెరిగేలా ఉండాలి. మహిళ అభ్యర్థులకు ఎత్తు 150 సెంటీమీటర్లు సరిపోతుంది.
-చాకచక్యం, తెలివితేటలకు సంబంధించి చివరగా మరో పరీక్షను నిర్వహిస్తారు. పర్సనాలిటీ టెస్ట్ పేరిట రాత పరీక్ష ఉంటుంది. సామాజిక స్థితిగతులు, తెలంగాణ హిస్టరీపై ప్రశ్నలు ఉంటాయి. 

వయోపరిమితిపై స్పష్టత 


కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సాధారణ అభ్యర్థులు 18 ఏండ్లనుంచి 25ఏండ్ల లోపు ఉండాలి. జూలై 1, 1990- జూలై 1,1997 మధ్య జన్మించి ఉండాలి. హోంగార్డు విషయంలోనూ కొంత వెసులుబాటు కల్పించారు. హోంగార్డుల నుంచి వచ్చిన వినతులు పరిశీలించిన ప్రభుత్వం వారికి కూడా కొంత మేర అవకాశం కల్పించింది. ప్రస్తుతం హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వారిలో కనీసం 360 రోజుల పాటు డ్యూటీలో ఉండి ఉండాలి. 18ఏండ్లనుంచి 33ఏండ్లవరకు హోంగార్డుల విషయంలో వయో పరిమితి ఉంటుందని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. 2, జూలై 1982- 1 జూలై 1997 మధ్య జన్మించిన వారై ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏండ్ల నుంచి 33 ఏండ్లలోపు ఉండాలని సూచించారు. 2 జూలై 1982 , 1 జూలై 1997 మధ్య జన్మించి ఉండాలన్నారు.

సిలబస్ వివరాలు 


కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన 200 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.

సబ్జెక్ట్‌ల వివరాలు 


ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్; ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ; కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్; టెస్ట్ ఆఫ్ రిజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ ఆఫ్ పర్‌టెయినింగ్ టూ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇంగ్లీషుకు సంబంధించిన సిలబస్‌లో ప్రశ్నలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఫైనల్ రాత పరీక్ష ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన 200 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.

ఫైనల్ రాత పరీక్ష సబ్జెక్ట్‌ల వివరాలు.. 


ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్; ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ; కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్; టెస్ట్ ఆఫ్ రిజనింగ్, మెంటల్ ఎబిలిటీ, పర్సనాల్టీ టెస్టు (ఎథిక్స్, సెన్సిటివిటీ టూ జెండర్, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, ఎమోషనల్ ఇంటలిజెన్స్‌పై ప్రశ్నలు ఉంటాయి); కంటెంట్స్ ఆఫ్ పర్‌టెయినింగ్ టూ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇంగ్లీషుకు సంబంధించిన సిలబస్‌లో ప్రశ్నలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి.

విద్యార్హతలు 


కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒకవేళ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే ఎస్సెస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిబంధనల్లో పేర్కొంది.
Share on Google Plus

About Unknown

I'm Sanjeev, a part-time blogger from Hyderabad, India. I started this blog as a passion.Here I write about News, Sports, Technology, Reviews etc.. You can read more about me at About us page.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment